ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 11:58 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

మంత్రాల నెపంతో మహిళ దారుణ హత్య..అర్ధరాత్రి మరిది ఘాతుకం

మంత్రాల నెపంతో మహిళ దారుణ హత్య..అర్ధరాత్రి మరిది ఘాతుకం

మంచిర్యాల .అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 9.

మంత్రాలు చేస్తున్నారనే అనుమానం ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నెల్కి వెంకటాపూర్ గ్రామానికి చెందిన సింగతి లక్ష్మి (42) అనే మహిళను ఆమె మరిది అర్ధరాత్రి సమయంలో దారుణంగా నరికి హత్య చేసినట్లు సమాచారం.

గ్రామంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మంత్రాల నెపంతోనే లక్ష్మిపై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ దారుణ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. హత్యకు అసలు కారణాలు ఏమిటి? మంత్రాలపై ఉన్న అనుమానమే దాడికి కారణమా? లేక కుటుంబ కలహాలకు మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో నెల్కి వెంకటాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మూఢనమ్మకాల కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.